కలం, వెబ్ డెస్క్ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ మూడో రోజు పాదయాత్ర హైదరాబాద్‌లోని మైత్రివనం చౌరస్తాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna), ప్రముఖ నటుడు సాయికుమార్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాదయాత్రకు తరలివచ్చిన విద్యార్థులతో నాగార్జున డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని మనందరం తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. యువత బంగారు భవిష్యత్ కోసం చేపట్టిన ఈ గొప్ప సంకల్పం కచ్చితంగా నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇంతటి భారీ యూత్ ఫాలోయింగ్ ఉందని తాను ఇప్పుడే చూస్తున్నానని నాగార్జున ప్రశంసించారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రధాని మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని ఆయన కోరారు.

