కలం, కరీంనగర్ బ్యూరో: “కష్టపడి సంపాదించిన కూలీ డబ్బులు మద్యం పాలవుతున్నాయి.. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఇక మా ఇళ్లను మీరే కాపాడాలి” అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ (Kachapur) గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపులను శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి వినతిపత్రం సమర్పించారు.
యువత భవిష్యత్తు అంధకారం..
గత కొన్నేళ్లుగా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభమై అర్ధరాత్రి వరకు సాగుతున్నాయని తెలిపారు. దీంతో పురుషులు రోజువారీ కూలీ డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తున్నారని, మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడులకు, హింసకు పాల్పడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలోని యువత కూడా మద్యానికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామసభలో తీర్మానం చేయాలి..
కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిపై పోరాటానికి సిద్ధమయ్యారు. గ్రామంలోని అక్రమ బెల్టు షాపులను తక్షణమే మూసివేయించాలని పాలకవర్గాన్ని కోరారు. గ్రామసభ ఏర్పాటు చేసి బెల్టు షాపుల శాశ్వత నిషేధంపై తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా విధించాలని కోరారు. పాలకవర్గం తీసుకునే నిర్ణయంపైనే తమ కుటుంబాల ఆర్థిక, సామాజిక గౌరవం ఆధారపడి ఉందని మహిళలు స్పష్టం చేశారు.

