కలం, కరీంనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తుది ఓటర్ల జాబితా ఇంకా ప్రచురితం కాకముందే, తొలగించబడిన అర్హులైన ఓటర్ల వివరాలను సమర్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం బిడ్డ పుట్టకముందే జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరినట్లుగా ఉందని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ ఆమేర్ (Mohammed Ameer)ఎద్దేవా చేశారు.
గురువారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం (ECI) స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అని, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO), జిల్లా ఎన్నికల అధికారులు (DEO) వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితా విడుదల కాకముందే వివరాలు అడగడం అధికార పరిధి, కాలక్రమాన్ని పాటించకపోవడమేనని విమర్శించారు.
స్మార్ట్ సిటీ నిధులపై సవాల్
గతంలో అభివృద్ధి పేరుతో చేపట్టిన పనుల్లో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆమేర్ ఆరోపించారు. శ్మశానవాటికల్లో గడ్డి పీకడం, కమాన్‌లకు రంగులు వేయడం, నాసిరకం జంక్షన్ల నిర్మాణం, 24×7 నీటి సరఫరా, డీజిల్ ఖర్చులు, యువజన సంఘాల భవనాల నిర్మాణంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ఎంపీకి బహిరంగ చర్చకు ఆహ్వానం
స్మార్ట్ సిటీ నిధుల వినియోగంపై కేంద్ర స్థాయిలో సమగ్ర విచారణ కోరని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆమేర్ విమర్శించారు. గతంలో చేపట్టిన పనుల ఖర్చులు, నాణ్యతపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు ప్రెస్‌మీట్లలో చెప్పే గొప్పలు కాకుండా పారదర్శక పాలన, ప్రజాధనంపై జవాబుదారీతనం కావాలని ఆమేర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు అబ్దుల్ రెహమాన్, గంగుల దిలీప్, అబ్దుల్ జమీల్, కోలగాని అనిల్, షాహిద్ ఆఫ్రిది, షేక్ అజీమ్, మహమ్మద్ సుఫియాన్ తదితరులు పాల్గొన్నారు.

