మహిళలు, చిన్నారుల భద్రతపై యాదగిరిగుట్ట పోలీసుల సమరశంఖం!

కలం, యాదగిరిగుట్ట: మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ యాదగిరిగుట్ట(Yadagirigutta) పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై వేధింపులు, చిన్నారుల పట్ల జరుగుతున్న అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు ప్రతి ఒక్కరిలో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో తమ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వేధింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.

చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చిన్న వయస్సు నుంచే పిల్లలకు మంచి స్పర్శ, చెడు స్పర్శపై అవగాహన కల్పించాలని, తమకు ఎదురైన ఇబ్బందులను భయం లేకుండా తల్లిదండ్రులతో చెప్పుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. అపరిచితుల వెంట వెళ్లకుండా, వారి నుంచి బహుమతులు, ఆహార పదార్థాలు స్వీకరించకుండా జాగ్రత్తలు నేర్పించాలని పేర్కొన్నారు.

అలాగే సోషల్ మీడియా, ఆన్‌లైన్ పరిచయాల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, వారి డిజిటల్ కార్యకలాపాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాదగిరిగుట్ట ఎస్ఐ యాదయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>