కలం, నిర్మల్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) పాల్గొన్నారు. హైదరాబాద్లోని లిబర్టీ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ మార్చ్ నిర్వహించారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల ప్రాధాన్యతను చాటుతూ మార్చ్ నిర్వహించారు.

