కలం, మహబూబ్ నగర్ బ్యూరో : భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగి బాల్ కిషన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా గురువారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండు చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా, నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రజల హక్కులను హరించే విధానాలను ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను సర్ పేరుతో ఓట్లను కొల్లగొట్టే ధోరణి ద్వారా మళ్ళీ అధికారం లోకి రావాలనిచూస్తుంది, న్యాయవ్యవస్థలో నియామకాల కోసం ఉన్న కొలీజియం వ్యవస్థ, స్వతంత్రతను కాపాడాలని, న్యాయమూర్తుల ఎంపికలో రాజకీయ జోక్యానికి తావుండకూడదన్నారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే సమగ్ర ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, యువత భవిష్యత్తు పరిరక్షణ కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని విలువలను ఆచరణలో అమలు చేయడం ద్వారా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలమని అన్నారు. రాజ్యాంగ హక్కులపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండపల్లి రాము, కె. పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జి. సత్యనారాయణ రెడ్డి, మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవరాజ్, మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి ఇందిరక్క, పాలమూరు యూనివర్సిటీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, పట్టణ నాయకులు సుందర్ రాజ్, రామకృష్ణ, గుడ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

