కలం, వెబ్ డెస్క్: ఎల్నినో దృష్ట్యా తెలంగాణలో కరువు నేపథ్యంలో రానున్న 15 నెలలకు సరిపడా సన్నబియ్యం బఫర్ స్టాక్ (Fine Rice Buffer Stock) సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), వివిధ సంస్థల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం నిల్వలను సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ పనితీరుపై పౌరసరఫరాల కమిషనర్ నాగిరెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
వాతావరణ అనిశ్చితి, వ్యవసాయ దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే ఛాన్స్ ఉన్నందున రాష్ట్ర ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సన్నధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 నెలల అవసరాలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, రానున్న వ్యవసాయ సీజన్లపై నెలకొన్న అనిశ్చితిని దృష్ట్యా మరింత అధిక స్థాయిలో బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని.. సన్నబియ్యం పథకానికి నిరంతరాయంగా సరఫరా జరిగేలా సన్న రకాల ధాన్యం సేకరణను గరిష్ఠ స్థాయికి పెంచాలని సూచించారు.

