మత్తుపదార్థాల కట్టడికి కలెక్టర్ కఠిన ఆదేశాలు

కలం, కరీంనగర్: డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణా (Drug Trafficking), వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీలో నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, మెడికల్ షాపులు, పాన్ షాపులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు మత్తుపదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, మత్తుకు బానిసైన వారికి నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణించి చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని తెలిపారు.గత నెలలో 10 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 570 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ దుర్గాభవాని వివరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఐడీఓసీలో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు, రెయిలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

అతివేగం, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పీఎం రహత్ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సీపీ గౌస్ ఆలం, నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ స్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

ఎస్సీ, ఎస్టీల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అట్రాసిటీ కేసుల బాధితులకు పరిహారం సకాలంలో అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండల స్థాయి ప్రజావాణిలో ప్రతి నెలా ఒక రోజును ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని, అన్ని గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించి హక్కులపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 4,150 మంది ఎస్సీ, 197 మంది ఎస్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ మల్టీ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని సూచించారు.

సీపీ గౌస్ ఆలం అట్రాసిటీ కేసుల నమోదు, విచారణ, చార్జిషీట్ల పురోగతిని వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ట్రైనీ కలెక్టర్ హరి ప్రసాద్, ఆర్డీవోలు, ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>