కలం, ఆదిలాబాద్: జిల్లాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అమలవుతున్న జీవనోపాధి పథకాలను పకడ్బందీగా అమలు చేసి, మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ–సెర్ప్ పథకాల ప్రగతిపై సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ద్వారా ఇప్పటివరకు రూ.93,700 నికర లాభం రావడం అభినందనీయమని, పెట్రోల్ బంకుకు విస్తృత ప్రచారం కల్పించి పూర్తిస్థాయిలో నడిపించాలని, ఎవరికీ క్రెడిట్ పై ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ మహిళా మార్ట్‌లో సరకుల కొరత తలెత్తకుండా పక్కా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బయటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్ట్ సిబ్బందికి లక్ష్యాల ఆధారిత వేతన విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు 40 శాతం రాయితీతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను, 50 శాతం రాయితీతో వ్యవసాయ డ్రోన్లను పొందేలా ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని సూచించారు. ఉట్నూర్, గుడిహత్నూర్ ఎఫ్‌పీసీల కార్యకలాపాలను వేగవంతం చేసి గోదాముల నిర్మాణం, ఎరువుల దుకాణాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. ఇంద్రవెల్లి, భీంపూర్, నార్నూర్, ఉట్నూర్, నేరడిగొండ మండలాల్లో సాగు చేస్తున్న మునగ (మొరింగా) తోటలను మరింత విస్తరించి, ఆకుపొడి తయారీ యూనిట్ల ద్వారా రైతులు, మహిళలకు అదనపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఏడు మండలాల్లో రైతులు నాటిన వెదురు మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది నాలుగు రోజుల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి నీటి తడులు అందేలా చూడాలని, వివరాలను ‘టీజీ లైవ్లీహుడ్’ యాప్‌లో నమోదు చేయాలన్నారు. నార్నూర్ మండలంలో టీజీఎల్‌ఐపీ కార్యక్రమం కింద గుర్తించిన 1,003 నిరుపేద కుటుంబాలకు ఆధార్, రేషన్, జాబ్ కార్డులు, పింఛన్లు, బ్యాంకు ఖాతాలు వంద శాతం అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.
వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్లకు అనుసంధానంగా జీవనోపాధి యూనిట్ల ఏర్పాటు, గుడిహత్నూర్ మండలం ధర్ముగూడలో మోదుగు ఆకు విస్తర్ల తయారీ, నార్నూర్ మహువా లడ్డు యూనిట్ పనితీరు, పాఠశాలల యూనిఫాంల కుట్టుపని, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ఎన్‌పీఏ తగ్గింపు, బతుకమ్మ చీరల పంపిణీ, పశుసంవర్ధక–మత్స్య యూనిట్ల గ్రౌండింగ్ ప్రగతిపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, ఇంచార్జి డిఏఓ శ్రీధర్, ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

