తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా కేసీఆర్ దీక్ష: చిరుమర్తి లింగయ్య

కలం, నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (KCR Hunger Strike) తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthy Lingaiah) పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన నవంబర్ 29వ తేదీని ప్రతి ఏటా ‘దీక్షా దివస్’గా జరుపుకుంటున్నామని తెలిపారు. బుధవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి హరీశ్ రావు నాయకత్వంలో ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్  కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు లింగయ్య పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి బలమైన రాజకీయ దిశను చూపిస్తూ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక వ్యక్తి పోరాటం కాదని, అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటం యావత్ దేశం దృష్టిని తెలంగాణ వైపు మళ్లించి, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చిందని పేర్కొన్నారు.

ఎన్నో అడ్డంకులు, కుట్రలు ఎదురైనా తెలంగాణ సమాజం ఒక్కటై పోరాడటం వల్లే 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపామని చిరుమర్తి లింగయ్య వివరించారు. అయితే, నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమవుతోందని ఆయన విమర్శించారు.

రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అమరవీరుల త్యాగాలను, ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించవద్దని హితవు పలికారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని, ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>