కలం, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ (Basara Temple) అభివృద్ధి, విస్తరణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramaiyer) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం బాసరలో దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra)తో కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
బాసర ఆలయ అభివృద్ధికి రూపొందించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందులో ఆలయ ప్రధాన నిర్మాణాలు, రాజగోపురం, శిలా మండపం, ప్రాకారాలు, వీఐపీ అతిథి గృహాలు, గోశాల, రహదారుల అభివృద్ధి, భక్తుల కోసం క్యూ లైన్లు, విద్యుత్ సబ్స్టేషన్, ఈఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని తెలిపారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని సూచించారు. దర్శనం, వసతి, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలకు మాస్టర్ ప్లాన్లో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపడుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఆలయ ప్రాకార మండపం, తూర్పు గోపురం, గజస్తంభం, గర్భాలయం, క్యూ లైన్లు, కిచెన్, డైనింగ్ హాల్ తదితర కీలక నిర్మాణ పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను శైలజా రామయ్యర్ ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, శాఖలవారీగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకుని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు గోవింద్ హరి, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ వసంత్ నాయక్, ఆలయ ఈఓ అంజనీదేవి, ఆర్డీఓ దేవిదాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

