కలం, మునుగోడు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో అండగా నిలుస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి భీమనపల్లి రాజు అన్నారు. గట్టుప్పల మండల పరిధిలోని వెల్మకన్నె (Velmakanne) గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుల స్వప్న రమేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

