కలం, నేషనల్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఈ కేసును తాజాగా మరోసారి పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందా? పిటిషన్ విచారణకు అర్హమైనదేనా? అనే అంశాలను హైకోర్టు న్యాయస్థానం పునఃపరిశీలించాలని స్పష్టం చేసింది.
కాగా, కర్ణాటకకు చెందిన విఘ్నేశ్ శిశిర్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని సీబీఐ, ఈడీలను అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో ఆగస్టులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఎలాంటి నివేదికలు సమర్పించవద్దని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. తాజాగా హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ బాధ్యతను తిరిగి హైకోర్టుకు అప్పగించింది. ఇదే పిటిషనర్ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ మరో ఆరోపణ కూడా చేశారు.

