కలం, నిర్మల్: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు, భూభారతి (Bhu Bharati) దరఖాస్తులు, భూముల రీసర్వే, భూసేకరణ, కోర్టు కేసుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ పాల్గొని జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలోని వివిధ అంశాల పురోగతిని వివరించారు.
ఈ సందర్భంగా భూభారతి పథకం కింద జిల్లాలో 34 పాత కేసులు, 158 కొత్త కేసులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా 60 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేసి, న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేటాయించిన 40 రోవర్లను వినియోగిస్తూ సర్వే పనులు చేపడుతున్నట్లు డీఆర్వో వివరించారు. జిల్లాలోని 14 నాన్ క్యాడస్ట్రల్ గ్రామాలకు గాను 9 గ్రామాల్లో, 17 క్యాడస్ట్రల్ గ్రామాలకు గాను 8 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పోర్టల్లో అప్లోడ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.
జిల్లాలో భూసేకరణ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. జీవో 59 కింద పెండింగ్లో ఉన్న 93 దరఖాస్తులకు సంబంధించి 91 మంది దరఖాస్తుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సూచించారు. తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ప్రతి పెండింగ్ దరఖాస్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రెవెన్యూ అంశాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏవో ప్రవీణ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు సంధ్యారాణి, స్వాతి, సర్పరాజ్, ఈడీఎం నదీం తదితరులు పాల్గొన్నారు.

