కలం, వెబ్ డెస్క్: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు(Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో బుధవారం నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పార్వతీపురం, కోనసీమ, అల్లూరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
కాగా మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తపట్నం 3.4, కావలి 3.4, మారెళ్ల 3.3, త్రిపురాంతకం 2.7, నెల్లూరు 2.7, ములుకుదురు 2.6, నెల్లూరు రూరల్ 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

