నీటి కుట్రకు తెరలేపిన ఆ ముగ్గురు: పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో: ఫామ్‌హౌస్‌లోని శకుని మామ, అబద్ధాల హరీశ్‌ రావు, ట్విట్టర్ టిల్లు కలిసి ఏపీ నీటి కుట్రలో ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాశారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం ధనదాహంతో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. ​మంగళవారం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పొంగులేటి.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండాలో 25, 26, 27, 28 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

వారి హయాంలోనే అవకాశం..

అనంతరం నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై కావాలనే విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ​2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు తదితరులు కృష్ణా జలాల్లో తెలంగాణకు 578 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా.. కేవలం 298 టీఎంసీల నీళ్లు సరిపోతాయని అంగీకరించారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పైగా పెంచినా అప్పట్లో ప్రశ్నించలేదన్నారు. అంతేకాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పల్నాడు నీటి మళ్లింపు పథకాలకు కూడా గత బీఆర్ఎస్ పాలనలోనే అవకాశం కల్పించారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రయోజనాలు విస్మరించి..

​తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న గత పాలకులు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 145 అడుగుల నుంచి 148 అడుగులకు పెంచుకుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని, కేంద్ర మంత్రితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చర్చించారని, నిలిచిపోయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఫైల్‌కు ముప్పు లేకుండా మళ్లీ కదలిక తీసుకొచ్చారని వెల్లడించారు. ​రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలే మళ్లీ తగిన గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. కలెక్టర్ దివాకర టి.ఎస్, ఏదులాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కాంగ్రెస్ పార్టీ ఏదులాపురం అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, కౌన్సిలర్లు దివ్య, నవీన్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>