మత్స్యకారుల గల్లంతు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కాకినాడ జిల్లా సుబ్బంపేట మత్స్యకారుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరా తీశారు. ఈ మేరకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఆరుగురి మత్సకారుల ఆచూకీ కనిపెట్టేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు. గాలింపు వేగవంతం చేసేందుకు మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, గాలింపు చర్యలపై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. గల్లంతైన మత్సకారులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఇప్పటికే ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మత్సకారుల ఆచూకీ కనిపెట్టేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

అటు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సైతం.. ఎప్పటికప్పుడు మత్సకారుల గల్లంతు ఘటనపై ఆరా తీస్తున్నారు. ఆరుగురినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బోటులో ఉన్న ఇంధనం, ఆహార నిల్వలను పరిగణనలోకి తీసుకుంటే మత్స్యకారులు క్షేమంగా ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత విభాగాలతో సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మత్సకారుల గల్లంతుపై కీలక విషయాలు..

మత్సకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక విషయాలు వివరించారు. సుబ్బంపేటకు చెందిన గరికాని సింహాద్రి (తండ్రి మాములు) బోటుతో పాటు మరో పడవ ఈ నెల 4న చేపల వేట కోసం ఒడిశాలోని పారాదీప్ వైపు బయలుదేరాయని చెప్పారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. రెండు బోట్లలో ఒకటి ఈ నెల 18న తిరిగి రాగా, మరొకటి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురై 19న కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు.

ఈ విషయం తెలియగానే రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఈ నెల 19వ తేదీ రాత్రే కోస్ట్‌గార్డ్‌కు లేఖ రాసి తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని కోరినట్లు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. దీంతో కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్ విభాగాలు, చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సమన్వయంతో గాలింపు చర్యలు ప్రారంభించాయని స్పష్టం చేశారు. గల్లంతైన బోటులో సుమారు 1,500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>