రెడ్‌క్రాస్ సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, నిరుపేదలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన గ్రామాల్లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. డిసెంబరులో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించి, జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రెడ్‌క్రాస్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి, రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో యువత, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ వాలంటీర్ల నమోదును విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలన్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పాఠశాల విద్యార్థులు జూనియర్ రెడ్‌క్రాస్‌లో, 18 నుంచి 30 ఏళ్ల యువత యూత్ రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేరవచ్చని తెలిపారు.

ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల విద్యార్థులు, యువత www.redcross.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఆర్. క్రాంతి కుమార్, వైస్ చైర్మన్ మనోహర్, సభ్యులు కె. పార్థసారథి, సంజీవరావు, రాజు, రూపేష్ రెడ్డి, ఉషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>