కలం, జోగులాంబ గద్వాల: కార్తీక పౌర్ణమి వేళ నడిగడ్డ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ఎటుచూసినా కార్తీక దీపాల కాంతులు.. ఆలయాల్లో శివనామస్మరణలు.. నదీ తీరాల్లో భక్తుల సందడి కనిపించింది. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లావ్యాప్తంగా మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు తరలివచ్చారు. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదుల్లో వదిలి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
దీపాల వెలుగుల్లో నదీ తీరాలు
కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో మహిళలు పెద్ద సంఖ్యలో నదీ తీరాలకు చేరుకున్నారు. అరటిదొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలారు. నదులపై తేలియాడుతున్న దీపాలు కనువిందు చేశాయి. అనంతరం సమీపంలోని ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల్లో పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
కిక్కిరిసిన నదీ అగ్రహారం
గద్వాల పట్టణంలోని నదీ అగ్రహారం వద్ద కృష్ణానది పుష్కరఘాట్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుష్కరఘాట్‌లో రద్దీ నెలకొంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదిలో వదిలారు. అనంతరం సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నదిపై తేలియాడుతున్న దీపాల వెలుగులు చూపరులను ఆకట్టుకున్నాయి.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
జిల్లాలోని ప్రధాన శివాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలు సైతం భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక వ్రతాలు ఆచరించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కొనసాగిన పూజలు, దీపారాధనలతో జిల్లా అంతటా కార్తీక పౌర్ణమి పండుగ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది.

