కలం, ఖమ్మం బ్యూరో : ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని మరో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలం సాయిబాబా ఆలయం సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది.
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు మంగళవారం ఉదయం సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని భద్రాచలం దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వరంగల్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో మణుగూరు పట్టణ శివారులోని సాయిబాబా ఆలయం వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రాంగ్ రూట్లోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో సంజయ్, శివ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మణుగూరులోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

