కలం, మల్కాపూర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance) సద్వినియోగం చేసుకోవాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో సమీపంలోని వార్డు కార్యాలయానికి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మంగళవారం మార్నింగ్ వాక్‌లో భాగంగా 16వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్‌లో (Malkapur) స్థానిక కార్పొరేటర్ కాంతాల జగన్ రెడ్డి, నాయకులతో కలిసి పలు కాలనీల్లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో నమోదు చేసుకున్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నమోదు చేసుకోని వారు వెంటనే వార్డు కార్యాలయానికి వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు. పథకంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గతంలో మంజూరు చేసిన సుడా నిధులతో చేపట్టాల్సిన మురుగు కాలువ పనులను పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ ఈశ్వర్ గౌడ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కాశిపాక శంకరయ్య, కాంతాల సందీప్ రెడ్డి, గంట రమ, దేవునూరి శంకర్, లంక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

