కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వాళ్ల పాలన మోసగాడు సినిమా అయితే, కాంగ్రెస్ పాలన మోసగాళ్లకే మోసగాళ్ల సినిమాలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. ఈ మోసగాళ్ల భరతం పట్టేందుకే రేపు తెలంగాణకు ధురంధర్ వస్తున్నారంటూ పరోక్షంగా అమిత్ షా పర్యటనను ప్రస్తావించారు. భారత్ సమ్మిట్ పెట్టి రూ.30 కోట్లు ఖర్చు పెట్టి.. దేశ వ్యతిరేక ప్రచారం చేస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి భారత్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేంటన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. దాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నీళ్లలో కర్ణాటక నుంచి రావాల్సిన వాటాపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. డీకే శివకుమార్ మీ దోస్త్ కాబట్టి, అందుకే మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
రూ.13 లక్షల కోట్లు ఇచ్చాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.13 లక్షల కోట్లు తెలంగాణకు అందించామని రామచందర్ రావు స్పష్టం చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గానికే రూ.10 వేల కోట్లు తీసుకెళ్లిపోతే.. మరి మిగతా ప్రాంతాల పరిస్థితేంటన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓడిపోతాయని, ఇక రాహుల్ గాంధీ ప్రధాని ఎలా అవుతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీయడంలో రాహుల్ గాంధీ ముందుంటారని.. ఆయన ప్రధాని అవుతారనడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.

