కలం, కరీంనగర్: ముంబై వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ‘3వ వరల్డ్ మేయర్స్ ఫోరం’ అంతర్జాతీయ సదస్సుకు కరీంనగర్ నగర మేయర్(Mayor) కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం అందింది. నవంబర్ 25 , 26వ తేదీలలో ముంబైలోని ఫెయిర్మాంట్ హోటల్ వేదికగా ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 దేశాల నగరాల మేయర్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని భవిష్యత్ నగరాల అభివృద్ధిపై చర్చించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నవంబర్ 25, 26 తేదీల్లో ముంబైలో జరగనున్న 3వ వరల్డ్ మేయర్స్ ఫోరంలో భవిష్యత్ నగరాల అభివృద్ధిపై కీలక చర్చలు జరగనున్నాయి. ఏఐ ఆధారిత నగరాల నిర్వహణ, వ్యర్థాల నియంత్రణ, పట్టణ రవాణా, పర్యావరణ పరిరక్షణ, నెట్‌జీరో మౌలిక సదుపాయాలు, వాతావరణ సంక్షోభం వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. మేయర్ కోలగాని శ్రీనివాస్ ఈ వేదికపై నగర అభివృద్ధి నమూనాను వివరించడంతో పాటు, ప్రపంచ నగరాల ఉత్తమ విధానాలను అధ్యయనం చేసే అవకాశం పొందనున్నారు.

