కలం, నిజామాబాద్ బ్యూరో: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 (Telangana Police Sports Meet) వేడుకలకు నిజామాబాద్ వేదిక అయ్యింది. ఈనెల 25వ తేదీ నుంచి నుంచి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే పోలీస్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ క్రీడా పోటీలు నవంబర్ 25 నుండి నవంబర్ 28వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్లు జిల్లాలకు చెందిన సుమారు 1,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలలో పాల్గొననున్నారు. పోలీస్ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీయడం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పోటీతత్వం, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడం ఈ క్రీడా మీట్ ప్రధాన ఉద్దేశ్యం అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు
ఈ స్పోర్ట్స్ మీట్లో ప్రధానంగా స్విమ్మింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆయా క్రీడలకు అనుగుణంగా క్రీడా వేదికలను సిద్ధం చేయడంతో పాటు, పోటీలు సజావుగా జరిగేలా అవసరమైన సాంకేతిక, నిర్వహణపరమైన ఏర్పాట్లు చేపట్టారు. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పోటీల నిర్వహణలో పారదర్శకత, సమయపాలన, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
క్రీడాకారులకు సమగ్ర సౌకర్యాలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నిజామాబాద్‌కు చేరుకుంటున్న క్రీడాకారుల కోసం వసతి, భోజనం, తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడాకారుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య బృందాలను అందుబాటులో ఉంచడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్‌లో జరిగే ఈ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా వేడుకలు పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచేలా, క్రీడాకారులకు మంచి అనుభూతిని అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడించారు.

