కలం, మునుగోడు : ఎన్నికల సమయంలో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం (Banda Srisailam) డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో మోగుదాల వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల వరి, పత్తి తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి, బాధిత రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల నష్టాన్ని అంచనా వేయాలని, పారదర్శకంగా సర్వే నిర్వహించి అర్హులైన రైతులందరికీ పరిహారం అందించాలని సూచించారు. ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించడం తగదని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బండ శ్రీశైలం హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకుడు మోగుదాల వెంకటేశం, మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, ఈరటి వెంకటయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.

