కలం, వెబ్‌డెస్క్: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar)కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న అరవ శ్రీధర్‌ను జనసేన వీర మహిళలు నడి రోడ్డుపై నిలదీశారు. అసలు మీది ఏ పార్టీ అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. జనసేన పార్టీలో ఉండి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఎలా మద్దతు ఇచ్చారంటూ నిలదీశారు. ఆ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా, పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఊహించని ఘటనతో అరవ శ్రీధర్ కొంత ఇబ్బందికి గురయ్యారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తనను ప్రచారానికి రావాలని పిలవలేదంటూ సమాధానమిచ్చారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకోసం ఎంతో కష్టపడితే మీరు మా కోసం ప్రచారానికి కూడా రాలేదని సదరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అభ్యర్థి పిలవకపోయినా పార్టీ గెలుపు కోసమైనా వచ్చి ఉండాల్సిందని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే (Arava Sridhar) స్పందిస్తూ రాకపోవడం తన తప్పేనని అంగీకరించారు. దీంతో సదరు మహిళలు శాంతించారు. రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే ఉన్నా టీడీపీ నాయకులదే పైచేయి అని, పెత్తనం అంతా వాళ్లదేనని జనసేన కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే ముందు వాపోయారు.
Also Read : ఏపీలో నంది అవార్డులు.. జీవో విడుదల
Follow Us On: Youtube

