కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం (అనకాపల్లి) జిల్లా సబ్బవరం (Sabbavaram) మండలం బాలజంగాలపాలెం టోల్గేట్ వద్ద భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. టోల్ గేట్ వద్ద టైర్ల లోడుతో ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలకు వేగంగా వ్యాపించాయి. లారీలో టైర్లు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువై, రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో టిప్పర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

