కలం, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రంగంలోకి దిగాయి. కార్పొరేషన్‌పై తన పట్టును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ (BRS Warangal) మరోసారి తన బలం నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇందుకు ఇతర పార్టీల్లోని మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలను గులాబీ గూటిలో చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది.
అయితే.. మొదటగా సుమారు 11 మంది మాజీ కార్పొరేటర్లతో పాటు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన గౌరు తిరుపతిరెడ్డి చేరతారనే ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చివరి నిమిషంలో ఊహించని పరిణామాలతో చేరికల వ్యూహానికి బ్రేక్ వేసినట్లు తెలుస్తున్నది. ఈ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, పార్టీలోని అంతర్గత విభేదాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
బలప్రదర్శనకు జనచైతన్య సభ
గ్రేటర్ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, ఇతర పార్టీల నేతలను చేర్చుకునే లక్ష్యంతో హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్ లో ఆదివారం జనచైతన్య సభ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సభను రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా, భారీ చేరికలతో పార్టీ బలం చాటుకునే వేదికగా మలచుకోవాలని స్థానిక నాయకత్వం భావించింది. అయితే ముందుగా సుముఖత వ్యక్తం చేసిన కొందరు దూరంగా ఉండటంతో చేరికల్లో ఆశించిన సందడి కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వర్గపోరుతో వెనకడుగు
తూర్పు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ నేతల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు నెలకొనగా.. ఆపరేషన్ ఆకర్ష్‌కు అడ్డంకిగా మారినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీలోని నేతల్లో సయోధ్య కుదరకపోవడం, కొత్తగా వచ్చే నేతలకు ఎలాంటి ప్రాధాన్యం కల్పించాలనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన నేతలను మరో వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో చేరికలకు ముందుకొచ్చిన పలువురు మాజీ కార్పొరేటర్లలో 11 మందికి ఎనిమిది మంది వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. దీంతో మొదట్లోనే ఆశించిన స్థాయిలో చేరికలు ఫలించలేదనే విమర్శలు వస్తున్నాయి.
చేరిన వారిపై రాజకీయ ఒత్తిళ్లు?
ఇప్పటికే బీఆర్ఎస్(BRS Warangal)లో చేరిన కొందరు నేతలు, మాజీ కార్పొరేటర్లపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. తాజాగా చిట్‌ఫండ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఓ మాజీ కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది. పార్టీ మారిన మరుసటి రోజే చోటుచేసుకోవడంతో హాట్ టాపిక్ అయింది. అరెస్టుకు చిట్‌ఫండ్ కేసులో వచ్చిన ఫిర్యాదే కారణమని తెలుస్తుండగా, రాజకీయ ఒత్తిళ్లతో ముడిపెట్టి కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేరేందుకు ఆసక్తి చూపిన నేతలు కూడా భవిష్యత్తు పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
గౌరు చేరికపై గుర్రుగా కేడర్
ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన గౌరు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంపై పార్టీలో కొత్త అసంతృప్తికి కారణమవుతు న్నట్లు తెలుస్తున్నది. ఆయన చేరికను కొందరు నేతలు స్వాగతిస్తుండగా, మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన, ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు కాకుండా కొత్తగా వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక పదవుల్లో కొత్తగా చేరే వారికి అవకాశం కల్పిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన పాత నేతలు కనిపిస్తున్నట్లుగా చర్చలో ఉంది.
మేయర్ పీఠంపై కన్ను
గ్రేటర్ (GWMC) ఎన్నికల్లో మేయర్ పదవిని దృష్టిలో పెట్టుకునే కొందరు నేతల చేరికలకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రాధాన్యం ఇస్తోందనే చర్చ కూడా సాగుతున్నది. గెలుపు సాధించాలంటే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతల అవసరం ఉందని ఒకవర్గం భావిస్తుండగా, ఇప్పటికే పార్టీలోని నేతలకే అవకాశాలు కల్పించాలని మరోవర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. రెండు వర్గాల నేతల అభిప్రాయాల మధ్య సమన్వయం కుదరకపోవడం పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతున్నది.
కేటీఆర్ అసహనానికి కారణమిదేనా?
సభకు ముందు భారీ చేరికలపై స్థానిక నాయకత్వం ఆశలు పెట్టుకోవడం, అందుకు అనుగుణంగా ప్రచారం జరగడం, చివరకు పలువురు వెనక్కి తగ్గడం పార్టీ ముఖ్య నాయకత్వానికి నిరాశ కలిగించినట్లు తెలుస్తున్నది. చేరికలపై నెలకొన్న అనిశ్చితి, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Also Read : డిసెంబర్ 16న బంగ్లాకు పయనం.. హసీనా ప్రకటనతో రాజకీయ ఉత్కంఠ!
Follow Us On : WhatsApp

