గోదావరిఖనిలో హత్య కేసు.. 12 గంటల్లోపే ఛేదించిన పోలీసులు

కలం, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలోని శివాలయం సమీపంలో 23-11-2026 తెల్లవారుజామున జరిగిన హత్య కేసు (Godavarikhani Murder Case)ను పట్టణ వన్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. హత్య జరిగిన 12 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి తెలిపారు. హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే గోదావరిఖని 1 టౌన్ ఇన్‌చార్జ్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి,పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆధారాలను సేకరించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచనలతో, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో దర్యాప్తు సాగింది. గోదావరిఖని వన్ టౌన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఎస్సైలు మనోహర్, రాజశేఖర్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం సేకరించి, నిందితులు పారిపోతున్న మార్గాలను గుర్తించారు.

అనంతరం 5 ఇంక్లైన్ చౌరస్తా సమీపంలో నేరానికి ఉపయోగించిన ఆటోలో వెళ్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం నిందితులను గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. మృతుడు అట్ల రాజశేఖర్ తండ్రి అట్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>