కలం, ఖమ్మం బ్యూరో: నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ.. పోలీసు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా వారికి అవసరమైన శిక్షణ, అధ్యయన సామగ్రిని అందించేందుకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ‘పొంగులేటి స్వరాజ్యం – రాఘవరెడ్డి (PSR) చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’ పేరిట పోటీ పరీక్షల పుస్తకాల కిట్లను (Ponguleti Seenanna Yuva Nestham Kits) పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం ఖమ్మంలోని (Khammam) మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, రైట్ ఛాయిస్ అకాడమీ ఛైర్మన్ మెండెం కిరణ్‌కుమార్, ఏదులాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ పోకబత్తిని అనిత అభ్యర్థులకు ఒక్కొక్కరికీ 16 రకాల పుస్తకాలతో కూడిన కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం కల్పించాలన్న సంకల్పంతో మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఖర్చుకు వెరవకుండా నాణ్యమైన ఉచిత కోచింగ్‌తో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన విలువైన పుస్తకాలను కూడా అందిస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని, తద్వారా తల్లిదండ్రుల ఆశలను, శీనన్న ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు.
తమకు ఉచిత శిక్షణ అందించడంతో పాటు ఖరీదైన పుస్తకాల కిట్లను కూడా ఉచితంగా అందిస్తున్న మంత్రి పొంగులేటికి అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శీనన్న తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కష్టపడి చదివి పోలీసు ఉద్యోగాలు సాధించి ఆయన రుణం తీర్చుకుంటామని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా ఒక్కో కిట్‌లో తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్ర, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ అంశాలు, బయాలజీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ వర్క్‌బుక్, ఫిజికల్ సైన్సెస్, రీజనింగ్, అర్థమెటిక్ వర్క్‌బుక్, ఇండియన్ జాగ్రఫీ, అర్థమెటిక్, తెలంగాణ సంస్కృతి–ఉద్యమ చరిత్ర పుస్తకాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి అభిమానులు, అకాడమీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

