కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎనిమిది మంది ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ (Khammam Probationary DSPs)లను కేటాయించారు. వీరిలో నలుగురిని ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు, మరో నలుగురిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, వీరంతా సోమవారం నుంచి తమ క్షేత్రస్థాయి శిక్షణను ప్రారంభించారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించిన సపావత్ దశరథ్, బోయినపల్లి ప్రణయ్ సాయి, వంగా అక్షయ్ కుమార్ రెడ్డి, అఖిలజా రెడ్డి అఖెల్లి సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. నిర్దేశిత కార్యక్రమం ప్రకారం వీరు కమిషనరేట్ పరిధిలో శిక్షణ పొందనున్నారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించిన మామిళ్ళ ఓంకార్ యాదవ్, సాయికుమార్ కన్నెకంటి, వినోద్ కుమార్ ఎట్టం, ఎం. సింధూజ సోమవారం జిల్లా పోలీస్ శాఖ పరిధిలో శిక్షణ కోసం చేరినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ఎనిమిది మంది ప్రొబేషనరీ డీఎస్పీలు పోలీస్ శాఖ పనితీరు, క్షేత్రస్థాయి విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు పోలీస్ స్టేషన్ల నిర్వహణ తదితర కీలక అంశాలపై ప్రయోగాత్మక అనుభవాన్ని పొందనున్నారు.

