కలం, వెబ్ డెస్క్: నీటి హక్కుల విషయంలో కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధ్వజమెత్తారు. ఊకదంపుడు ప్రసంగాలతో రాజకీయ ప్రయోజనం, ప్రాజెక్టుల పేర్లు, అంచనాలు మార్చి ఆర్థిక లాభం ఉండాలనేదే కేసీఆర్ ప్లాన్ అని మండిపడ్డారు. ఆయనలా తాను గొడవలు పెట్టుకోదల్చుకోలేదని స్పష్టం చేశారు. నీటి జలాల వివాదాల పరిష్కారంలో ఆవేశం పనికిరాదని, వ్యూహం, ఆలోచన ఉండాలన్నారు. కేంద్రంపై రాజకీయ, న్యాయపరమైన ఒత్తిడి తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు.
సుప్రీం కోర్టులో కూడా సమర్థంగా వాదనలు వినిపస్తున్నామని.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరామన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ పెద్ద మేధావి అనుకుంటారని.. అదేం కాదన్నారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తిపోయకపోయినా.. తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టుల వద్ద నీటి లభ్యత ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాకు ఇప్పుడు కూడా గోదావరి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు.
ఒక్క రాత్రిలో జరిగిపోదు..
మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించే విషయంలో ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారమే ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, హరీశ్ రావు హడావిడి చేసినంత మాత్రాన తాము తొందరపడబోమన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ ఒక్క రాత్రిలో జరిగిపోదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోలేదో తనకు అర్థం కాలేదన్నారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్, మేడిగడ్డ ప్రాజెక్ట్ లక్ష్యం ఒకటి కాదన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ద్వారా గ్రావిటీ ద్వారానే నీళ్లు పొలాలకు వస్తాయన్నారు. మహారాష్ట్రను 152 మీటర్ల ఎత్తుకు ఒప్పించడానికే తాము ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మేడిగడ్డను పునరుద్ధరించడం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించడం.. రెండూ ప్రాధాన్యతవే అన్నారు.

