కలం, వెబ్‌డెస్క్: అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు తెలంగాణ నీటి హక్కుల మీద మరణ శాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కృష్ణా జలాల పంపకాల విషయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్, హరీశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటా కోసం ప్రశ్నించే అవకాశం లేదన్నారని, మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేదని సీఎం రేవంత్ నిలదీశారు. తెలంగాణ వస్తేనే మన నీళ్లు, మన నిధులు మనకొస్తాయన్న కేసీఆర్ ఎందుకు నాడు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
నాడు కేంద్ర జలశక్తి మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో ఇటు కేసీఆర్ అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు హరీశ్ రావు, ఉమా మహేశ్వర రావులు ఓ కీలక సమావేశంలో పాల్గొన్నారని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో కృష్ణా జలాలకు సంబంధించి రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రాకు 367.34 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపకాలు చేస్తూ నిర్ణయించారన్నారు. మొత్తంగా ఏపీకి 512 టీఎంసీలు అని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్, హరీశ్ రావు అంగీకరించారన్నారు. దీనికి ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా సంతకాలు చేశారన్నారు.
పాలమూరు వలసలు, నల్లగొండ ఫ్లోరైడ్ గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్, తెలంగాణకు 575 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం వాదించకుండా ఎందుకు సంతకం పెట్టారని నిలదీశారు. ఈ విధంగా జరిగిన మొదటి ఒప్పందంలో ప్రతి సంవత్సరం దీనిపై చర్చించుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. అయితే కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌కు వెళ్తే బయటకు రారని, దీనిపై చర్చలకు అవకాశం లేకుండా కేసీఆర్ మరో అన్యాయం చేశారని సీఎం అన్నారు. 2020 జనవరి 29న ఏపీకి శాశ్వతంగా 512 నీటి కేటాయింపులను అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం పెట్టి తెలంగాణ జల హక్కులకు సమాధి కట్టారన్నారు. ఏపీకి 512 టీఎంసీలు ధారాదత్తం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

