కలం, కరీంనగర్: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ హాస్టళ్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) అధికారులను ఆదేశించారు. వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణాలు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల పరిధిలో వైద్యారోగ్య శాఖ ప్రగతిపై హైదరాబాదులోని సెక్రటేరియట్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల (Karimnagar Medical College)కు సంబంధించిన బాలికల హాస్టల్ నిర్మాణాన్ని నవంబర్ 2026 నెలాఖరులోగా పూర్తి చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దామోదర పేర్కొన్నారు. ఆర్అండ్బి శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. అవసరమైన కనీస వసతులు కల్పించి, డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ముందుగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థినుల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బాలుర బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బి శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా బాలుర హాస్టల్ నిర్మాణాన్ని డిసెంబర్ 2026 నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి దామోదర తెలిపారు.
నర్సింగ్ కళాశాల పనుల్లో వేగం..
నర్సింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలోనే నిధులు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. టీఎస్ఎంఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులను డిసెంబర్ 2026 నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ సమర్పించిన రికార్డుల ఆధారంగా పెండింగ్లో ఉన్న టోకెన్ నిధుల విడుదల అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య కళాశాల విద్యార్థులకు అదనపు బస్సు సౌకర్యాలు కల్పించే అంశంపైనా చర్చించారు.
నాలుగు జిల్లాల్లో వైద్య సేవలపై సమగ్ర సమీక్ష..
కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై విస్తృతంగా సమీక్షించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం), ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన సబ్ సెంటర్ పనుల్లో పెండింగ్ సమస్యలు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాట్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పనితీరును సమీక్షించారు. అదేవిధంగా మాతా శిశు ఆరోగ్య సూచికలు (ఎంసీహెచ్), టీబీ నషా ముక్త్ భారత్ కార్యక్రమం అమలు, డెంగ్యూ, మలేరియా కేసుల నమోదు, వ్యాధుల వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ నూతన ఉద్యోగుల సంక్షేమ పథకం అమలును క్రమబద్ధీకరించడంతోపాటు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

