కలం, నల్లగొండ : విద్యార్థుల్లో ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలు, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), యంగ్ ఫౌండర్స్ ల్యాబ్ ఫౌండేషన్ (వైఎఫ్ఎల్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది (MGU Signs MoU).ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధి, ఇంక్యుబేషన్, మెంటారింగ్, వ్యవస్థాపకత వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. వైఎఫ్ఎల్తో కుదిరిన ఒప్పందం విద్యార్థులకు వ్యవస్థాపకతపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు అన్వేషించే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ప్రధాన లక్ష్యంతో ఈ భాగస్వామ్యం రూపొందిందని చెప్పారు. ఈ సంయుక్త కార్యక్రమాలు ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ సంస్కృతి, నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
ఒప్పందం ప్రకారం విశ్వవిద్యాలయం స్థలం, మౌలిక వసతులు సమకూరుస్తుండగా, వైఎఫ్ఎల్ తన నైపుణ్యం, నిపుణుల సేవలు, శిక్షణ, మెంటారింగ్, ఇంక్యుబేషన్ సహకారాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. హరీశ్‌కుమార్ తెలిపారు. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు విద్యార్థులకు అవసరమైన మార్గదర్శనం, శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానం, స్టార్టప్ సహకారాన్ని ఈ కేంద్రం అందిస్తుందని చెప్పారు.
డిజిటల్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, మహిళా సాధికారత, సమాజ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.ఉపకులపతి సమక్షంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. అంజిరెడ్డి, వైఎఫ్ఎల్ డైరెక్టర్ శకుంతల కాసరగడ్డ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. హరీశ్‌కుమార్, ఆచార్య సాంబశివరావు, వైఎఫ్ఎల్ డైరెక్టర్ సత్యప్రసాద్ పెద్దపల్లి తదితరులు పాల్గొన్నారు.

