కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని రహదారులపై ( Madhira Roads) మట్టి, కంకర తరలిస్తున్న టిప్పర్ లారీలు మృత్యు శకటాలుగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన వేగంతో, పరిమితికి మించిన లోడుతో దూసుకెళ్తున్న ఈ వాహనాలను నియంత్రించాల్సిన యంత్రాంగం పూర్తిగా కళ్ళు మూసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై టిప్పర్ల బీభత్సంతో వాహనదారులు, పాదచారులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
తాజాగా సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఓ టిప్పర్ లారీ అతివేగంగా వెళ్తుండగా, అందులోని భారీ బండరాళ్లు అకస్మాత్తుగా రోడ్డుపై జారిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అటుగా ద్విచక్ర వాహనదారులు గానీ, పాదచారులు గానీ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తృటిలో తప్పింది. ఒకవేళ రద్దీ సమయాల్లో లేదా ఎవరైనా అటుగా వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించడమే కష్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక్కటే కాకుండా, టిప్పర్లలో మట్టి, కంకర తరలిస్తున్నప్పుడు కనీసం టార్పాలిన్ కవర్లు కూడా కప్పకపోవడంతో పట్టణంలోని పలు ప్రధాన రహదారులపై రాళ్లు, మట్టి, కంకర చెల్లాచెదురుగా రాలిపడుతున్నాయి. ఇలా రహదారులపై పేరుకుపోయిన కంకరపై వాహనాలు జారిపడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. టిప్పర్ల ఓవర్ స్పీడ్‌కు తోడు, రోడ్లపై పడిన రాళ్లు, మట్టిని తొలగించే బాధ్యతను ఎవరూ పట్టించుకోకపోవడం వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికి సంబంధిత అధికారుల్లో మాత్రం ఎలాంటి కదలిక కనిపించడం లేదని పట్టణ వాసులు మండిపడుతున్నారు. ప్రజలు ప్రమాదాలకు గురైతే లేదా ప్రాణాలు పోతే యంత్రాంగం మేల్కొంటుందా? అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు రవాణా, పోలీసు శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి, నిబంధనలు పాటించకుండా ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్‌తో తిరుగుతున్న మట్టి, కంకర టిప్పర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మధిర పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాహనాలపై కవర్లు తప్పనిసరి చేయడంతో పాటు, రోడ్లపై పడిన మట్టి, కంకర, రాళ్లను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా పెను ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

