కలం, నల్లగొండ : అగ్రిగోల్డ్ (AgriGold) బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు తిరిగి చెల్లింపు ప్రక్రియలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాకు సంబంధించిన బాండ్ల పరిశీలన ప్రారంభం కానుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (మహిళా ప్రాంగణం పక్కన)లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
మండలాల వారీగా కేటాయించిన తేదీల ప్రకారం రోజుకు 250 మంది బాండ్లను పరిశీలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. బాధితులు తమకు కేటాయించిన మండలాల వారీ తేదీల్లోనే కేంద్రానికి వచ్చి బాండ్లను ధృవీకరించుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన ఒరిజినల్ పత్రాలు, జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని సూచించారు. బాండ్ల పరిశీలనకు వచ్చే డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్‌తో పాటు ఖాతాదారుని పేరు, బ్యాంకు బ్రాంచ్ పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ స్పష్టంగా ఉన్న బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ తీసుకురావాలి.
ఒకవేళ డిపాజిటర్ మరణించి నామిని జీవించి ఉన్నట్లయితే, నామిని సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం, నామిని ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లు, రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రంతో పాటు నామిని బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ సమర్పించాలి. ఏజెంట్ ద్వారా బాండ్లను సమర్పించే పక్షంలో ప్రతి బాండ్ ఒరిజినల్‌ను చూపించడంతో పాటు కలర్ జిరాక్స్, లావాదేవీ నంబర్ వివరాలు ఇవ్వాలి.
అలాగే ఏజెంట్ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, ఫోన్ లేదా మొబైల్ నంబర్ వివరాలు, సమర్పించిన బాండ్లకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, రికార్డులు చూపిస్తూ ఏజెంట్ కోడ్‌ను తప్పనిసరిగా పేర్కొనాలి. మరిన్ని వివరాల కోసం బాధితులు 08682-222423, 8712670421 ఫోన్ నంబర్లను సంప్రదించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

