కలం, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) రాకతో కరీంనగర్ కాషాయమయమైంది. పార్టీ శ్రేణులతో కలిసి కరీంనగర్ లో నిర్వహించిన మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తెలంగాణలో రామరాజ్యం, నరేంద్ర మోదీ పాలన తీసుకోరావాలని పార్టీ కార్యకర్తలు జెండాలు మోస్తూ, లాఠీ దెబ్బలు తింటూ పోరాడుతున్నారని అన్నారు. తమ శరీరంలో దేశభక్తితో కూడిన కాషాయ రక్తం ప్రవహిస్తోందని.. గుండె ‘జై శ్రీరాం’ అని కొట్టుకుంటుందని చెప్పారు. లౌకికవాదులకు బీజేపీ బలం చాటిచెప్పేందుకే తాము ఈ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నితిన్ నబీన్ పై బండిసంజయ్ ప్రసంశలు వర్షం కురిపించారు. నితిన్ నబీన్ సామాన్య నాయకుడు కాదు, కొదమ సింహం.. ఆయన కంటి చూపులోనే వాడి ఉందన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడని.. నీతి, నిజాయితీతో పాటు కొత్త పంథాలో బీజేపీని ఉరకలెత్తిస్తున్న నాయకుడంటూ కొనియాడారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై 45 ఏళ్లకే బీజేపీకి అధ్యక్షుడయ్యారని పేర్కొన్నారు.
మహాపాదయాత్రలో కాంగ్రెస్ నేతలపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహుల సాయంతో విధ్వంసం సృష్టించాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘హే పప్పూ.. ఢిల్లీలో ఉన్నది నిప్పు.. ముట్టుకుంటే మాడి మసైపోతావ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి చొరబడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులకు ఓటు హక్కు ఉండటానికి వీల్లేదని మండిపడ్డారు. అలంటి దుర్మార్గులను బార్డర్ దాటించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. భారత ప్రజలు మాత్రమే ప్రధానిని నిర్ణయించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రకియను తీసుకొచ్చాయని తెలిపారు.

