కలం, వెబ్ డెస్క్ : భూ వివాద (Land Dispute)సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు కలెక్టరేట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు దారితీసింది.
బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు దేవన్న సోమవారం తన భూ వివాదానికి సంబంధించి న్యాయం కోరుతూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యాడు. తన భూమికి సంబంధించిన సమస్యను అధికారులకు వివరించి, పరిష్కారం చూపాలని వినతిపత్రం సమర్పించేందుకు అక్కడికి చేరుకున్నాడు. అయితే కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో అనూహ్యంగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఈ పరిణామంతో అక్కడున్న అధికారులు, ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది, పోలీసు సిబ్బంది రైతుకు ప్రాథమిక సహాయం అందించి, ఆటోలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
తన భూ వివాదం పరిష్కారం కాకపోవడం, సమస్యపై తీవ్ర మనస్తాపానికి గురికావడమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రజావాణికి న్యాయం కోసం వచ్చిన రైతు అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. దేవన్న ఆరోగ్య పరిస్థితి, భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారుల నుంచి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

