కలం, జోగులాంబ గద్వాల: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలోనూ పర్యవేక్షణ చేస్తున్నారని, సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. సోమవారం ప్రజావాణి(Prajavani) సందర్భంగా ఐడీఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కృష్ణ, కలెక్టరేట్ ఏవో మంజులతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.
అనంతరం మధుమోహన్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకపోవడంతో చాలామంది ప్రజలు అవే సమస్యలపై తిరిగి వస్తున్నారన్నారు. ఆయా ఆర్జీలను తిరస్కరించాల్సి ఉంటే అందుకు గల కారణాలను నిబంధనల ప్రకారం తెలియజేయాలని, ఆర్జీదారులకు ఏ విషయం చెప్పకుండా దరఖాస్తులను అలాగే ఉంచుకోవడం సరికాదన్నారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించి జిల్లా ప్రజావాణికి మొత్తం 41 ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజావాణి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సహదేవ్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ప్రజావాణికి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని వీటి పరిష్కారంలో చెప్పుకోదగ్గ ప్రగతి ఉన్నప్పటికీ మండల, డివిజన్, జిల్లా స్థాయి ప్రజావాణికి వచ్చిన ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపడం తగదన్నారు. మండల స్థాయి ప్రజావాణికి వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి బుధవారం సమీక్ష నిర్వహించాలన్నారు.
ప్రజావాణి ఆర్జీల పరిష్కారంలో జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రస్థాయిలో అగ్ర గామిలో ఉండేందుకు కృషి చేయాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాస్ జోషి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

