కలం, వెబ్డెస్క్: మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) పూర్తయ్యాక ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కూటమిలో మొదట్లో సీట్ల సర్దుబాటు అంశం చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారం తీవ్ర దుమారం రేపుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలు పూర్తయ్యాయి. కానీ, కొన్ని చోట్ల కేటాయింపుల పట్ల బీజేపీ, జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖ, నెల్లూరుతో సహా పలు జిల్లాల్లో నాయకులు బహిరంగంగానే తమ ఆవేదన బయటపెడుతున్నారు. ఇక తాజాగా ఆత్మకూరు (Atmakur)లో జరిగిన ఓ ఘటన జనసేన పార్టీలో చిచ్చు రేపింది.
ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ మేరకు పార్టీ నాయకురాలు శిరీషను పవన్ కల్యాణ్ అభ్యర్థిగా ప్రకటించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన శిరీషకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) బిగ్ షాకిచ్చారు. మంత్రి ఆనం పవన్ ప్రకటించిన అభ్యర్థిని కాకుండా జనసేనలోని మరో కౌన్సిలర్ పద్మను అభ్యర్థిగా నిర్ణయించారు, అంతే కాకుండా పోలీసులతో శిరీషను బయటకు పంపించి ఆయన నిర్ణయించిన అభ్యర్థితోనే ప్రమాణ స్వీకారం చేయించారు.
పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆనం ఎలా అభ్యర్థిని ఎంపిక చేస్తారని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జనసేన ఆత్మకూరు (Atmakur) ఇంచార్జ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని జనసేన నేతలను అరెస్ట్ చేశారు. మంత్రి ఆనం, పోలీసుల తీరుపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు జనసేనలో చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : హిందూ ఆలయాల పరిరక్షణ ఇదేనా..? చంద్రబాబు సర్కారుపై భూమన ఫైర్
Follow Us On: Youtube

