కలం, నిర్మల్: పోలీస్ విధులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవం పొందాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) సూచించారు. నెల రోజుల ప్రాక్టికల్ శిక్షణ కోసం జిల్లాకు కేటాయించిన శిక్షణ డీఎస్పీలు (DSP Trainees) గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, చట్టు భవాని సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ విభాగాల్లో నిర్వహించనున్న శిక్షణ, విధులు, బాధ్యతలపై ఎస్పీ వారికి వివరించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, బాధ్యతాయుతమైన అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

