కలం, హనుమకొండ: వరంగల్‌ను విద్యా, వైద్య రంగాలతో పాటు క్రీడారంగంలోనూ దేశస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని ఎంపీ కడియం కావ్య(Kadiyam Kavya) అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో డిసెంబర్ 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 వరంగల్‌కు గర్వకారణమన్నారు.
సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఖేలో ఇండియా అధికారిక మస్కట్ ‘నీలమణి’ పోస్టర్‌ను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం మంజూరు చేయడం సంతోషకరమన్నారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. క్రీడా పోటీలను విజయవంతం చేసి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని కోరారు. అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

