కలం, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై ( Khelo India Youth Games) జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ప్రధాన కూడళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఖేలో ఇండియా క్రీడలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖేలో ఇండియా క్రీడా పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా నుంచి ప్రత్యేక క్రీడా బృందాన్ని పోటీలను తిలకించేందుకు పంపించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దీనివల్ల క్రీడాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి, స్ఫూర్తి మరింత పెరుగుతుందన్నారు.
క్రీడా పోటీలు ముగిసే డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతిరోజూ వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత క్రీడా పాఠశాలలు, డీబీడీ కాంప్లెక్స్ మైదానం, ఏటీడీపీ పాఠశాల హాళ్లలో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, క్రీడల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్తు, డీఆర్వో స్రవంతి, క్రీడా శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

