కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసి డిపోలో బస్సు (Rayachoti Bus Accident) బీభత్సం సృష్టించింది. డిపోలోకి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సును డ్రైవర్ పార్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. డ్రైవర్ పొరపాటున బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కడంతో బస్సు వేగంగా ముందుకు దూసుకెళ్లి, అక్కడే క్లీనింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఔట్ సోర్సింగ్ విభాగంలో క్లీనింగ్ కార్మికురాలిగా పనిచేస్తున్న భారతి (34) బస్సు కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆమెతో పాటు విధులో ఉన్న మరో ఇద్దరు కార్మికులు బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోకు చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక బస్సులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

