కలం, జడ్చర్ల : జన గణన కోసం విద్యాబోధనను కుదించవద్దని బీసీ జాగృతి సేన (BC Jagruthi Sena) రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండల విద్యా వనరులకేంద్రంఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరిలో చేపట్టబోయే జనగణన కోసం ఉపాధ్యాయులతో డిసెంబర్‌లోపే సిలబస్ పూర్తి చేయించాలని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం సమంజసం కాదన్నారు.
విద్యా సంవత్సరం ముగిసే వరకు మార్చి నెల దాకా ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో విద్యాబోధన కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సిలబస్‌ను హడావుడిగా పూర్తి చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోయే ప్రమాదం ఉందన్నారు. జనగణన కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని,రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కార్యదర్శులను, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగం పేట్ శేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి గోపాల్, మండల కార్యదర్శి బుద్ధ సముద్రం చెన్నయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

