కలం, వెబ్ డెస్క్: కార్తీక మాసం(Kartika Masam) అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసం. ఈ మాసంలో శివుడిని, విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం, కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు కోటి రెట్ల పుణ్యఫలాన్ని అందిస్తాయి.
కార్తీక మాసం విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతిరోజూ విష్ణునామ స్మరణ, దీపారాధన, తులసీ పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం అత్యంత మంగళకరమని భక్తులు భావిస్తారు.
వ్రతం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు
వ్రతం ఆచరించడం వల్ల జీవితంలో అనేక శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో అభివృద్ధి లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ కలహాలు తొలగి, దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. కోరిన కోరికలు నెరవేరి, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగి, అంతిమంగా శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మోక్షమైన విష్ణు సాయుజ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వ్రతం ఎలా చేయాలి?
ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, మామిడి తోరణాలతో అలంకరించాలి. పూజా స్థలంలో స్వామివారి చిత్రపటం లేదా విగ్రహాన్ని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. అనంతరం ఐదు అధ్యాయాల వ్రత కథను చదవాలి. అరటిపండు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గోధుమ రవ్వ, చక్కెరతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. హారతి ఇచ్చి ప్రసాదం పంచాలి. వ్రతం అనంతరం బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

