కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో దాడులు చేస్తామంటూ ఉగ్రవాదుల నుంచి ఈ-మెయిల్ బెదిరింపులు రావడంపై డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) కీలక ప్రకటన చేశారు. ‘ఈ-మెయిల్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ సహా చుట్టుపక్కల కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించాం. వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నాం. పలు చోట్ల బాంబ్ స్వ్కాడ్ బృందాలను కూడా రంగంలోకి దించాం. ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇది నకిలీ ఈ-మెయిల్ అని ఇప్పటికే హైదరాబాద్ సీపీ నిర్ధారించారు’ అని తెలిపారు.
ఇలాంటి బెదిరింపులను తేలిగ్గా తీసుకోలేమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ‘నిబంధనల ప్రకారం, కచ్చితంగా తనిఖీలు చేపడుతున్నాం. వాహన తనిఖీల సందర్భంగా ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే క్షమించాలి. ప్రజల భద్రతనే మాకు అన్నింటికన్నా ముఖ్యం. అందుకే ఇలాంటి చర్యలు చేపట్టడం తప్పనిసరి. విమానాలకు బాంబు బెదిరింపులు వస్తే పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు టెన్షన్ ఉంటుంది’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్కు ఉగ్రవాదుల బెదిరింపులు వచ్చాయనే అంశం జాతీయ స్థాయిలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.

