కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్ (Hockey Series)ను భారత పురుషుల జట్టు ఓటమి లేకుండా ముగించింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఆక్లాండ్‌లోని లాయిడ్ ఎల్స్‌మోర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొమ్మిదో నిమిషంలో డైలన్ థామస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి న్యూజిలాండ్‌కు ఆధిక్యం అందించాడు.
16వ నిమిషంలో కెప్టెన్ సంజయ్ పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు తొలి గోల్ అందించాడు. మరో రెండు నిమిషాలకే కార్తీ సెల్వం ఫీల్డ్ గోల్‌తో భారత్‌ను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. చివరి వరకు భారత్ ఆధిక్యంలోనే కొనసాగింది. అయితే 55వ నిమిషంలో బెంజీ కల్హేన్ గోల్ చేయడంతో స్కోరు 2-2గా మారింది. చివరి నిమిషాల్లో ఇరు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను 3-2తో గెలిచింది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు 2-2తో డ్రా అయ్యాయి. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో భారత్ సొంతం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య వందేళ్ల క్రీడా సంబంధాలను గుర్తుచేసుకుంటూ ఈ టోర్నీని నిర్వహించారు. 1926లో మేజర్ ధ్యాన్‌చంద్ సభ్యుడిగా ఉన్న భారత ఆర్మీ హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ పర్యటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సిరీస్ జరిగింది.

