కలం, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం మత్స్యగిరి (Matsyagiri Temple) గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి, అమ్మవారికి కల్యాణ వేడుకలు జరిపించారు. కళ్యాణోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యగిరి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది భక్తులు కోరిన కోరికలను తీర్చేదిగా ప్రసిద్ధి చెందినదని అన్నారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఈవో కొత్తపల్లి వెంకటయ్య, చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

